చైనా దేశంలోని వూహాన్ నగరంలో ప్రారంభమైన కరోనాపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతుంది. ఈ వైరస్ అన్ని దేశాల్లో విస్తరిస్తుండటం అందరినీ కలవరపెడుతోంది. జర్మనీ దేశంలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ధ్రువీకరించారు. మొదట చైనా దేశీయుడికి సోకిన ఈ వైరస్ అతని సహఉద్యోగులైన జర్మనీకి చెందిన మరో ముగ్గురికి వచ్చిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి పనిచేసిన కంపెనీలో 140 మంది ఉద్యోగులను వైద్యాధికారులు పరీక్షలు చేస్తున్నారు. చైనా దేశంలోనే ఈ వైరస్ వల్ల ఇప్పటికే 106 మంది మరణించారు ప్రపంచంలోని 12 దేశాలకు కరోనావైరస్ వ్యాపించిందని వైద్యాధికారులు చెప్పారు. థాయ్ లాండ్ దేశంలోనూ కరోనా వైరస్ తో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారని ఆ దేశం తాజాగా ప్రకటించింది. థాయ్ లాండ్ దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించామని థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓ చా చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రజలను కోరారు. 'కరోనా' అనుమానితులు హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటుండడంతో నగరంలో ప్రభుత్వం పలు ఆస్పత్రుల్లో తీసుకుంటున్న చర్యలను, ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. డాక్టర్ అనితావర్మ నేతృత్వం లో డాక్టర్ అజయ్ చౌహాన్, డాక్టర్ శుభాఘ బృందం ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది. అనుమానితుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే గాంధీలో చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ అనురాధ వివరించారు. చైనా, హాంకాంగ్ నుంచి వస్తున్న వారి ఆరోగ్య వివరాలను ఎయిర్‌పోర్టులోనే తెలుసుకొని అక్కడిక్కడే పరీక్షలు చేస్తున్నామన్నారు.కరోనా వైరసపై తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. 'కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏ మాత్రం అశ్రద్ధ వద్దు. ప్రస్తుత సౌకర్యాలు ఓకే. కానీ.. ఇంకా పరిస్థితులు మెరుగుపరచుకోవాలి” అని ఇక్కడి వైద్యులకు సూచనలు చేసింది. అయితే చైనా దేశంలోని వూహాన్ నగరంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకే అవకాశముందని మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనా దేశంలోని హుబే ప్రావిను పరిధిలోని వూహాన్ నగరంలోని వైద్య కళాశాలలో వైద్య చదువుతున్న ఓ విద్యార్థి తాజాగా తన స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరానికి వచ్చారు. కరోనావైరస్ ప్రబలిన వూహాన్ నగరం నుంచి వైద్య విద్యార్థి ఈ నెల 13వతేదీన రావడంతో అతనికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుందనే అనుమానంతో అతన్ని వెంటనే ఉయిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని జిల్లా కలెక్టరు శశాంక్ మిశ్రా చెప్పారు. ఉజ్జయిని వైద్యవిద్యార్థి రక్తనమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణేలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని కలెక్టరు చెప్పారు కరోనావైరస్ ప్రబలిన వూహాన్ నగరం నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం పంపించేందుకు పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ అంగీకరించారు. చైనా నుంచి స్వదేశానికి వస్తున్న ప్రయాణికులను ఏడు విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు వైద్యపరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కరోనా కలవరం..